పాలు – పంచ ధార

పాలు నీవని కుడియ నెంచిన – పంచ ధారల బొమ్మ నేనయ!
పంతమాడక నీదు బలమును అందజేయుము నెమ్మన !!

కమ్మనైనీ పాల కుండను అంది పంచెడివారు -విబుధులు ,
అందుమంచూ కొసరి కూరిమినందజేతురు విరివిగా ,
ఆదరంబున దరిని జేర్చుక జుర్రుకొనుడని పంచుచూ,
విందుగందిన గుమ్మపాలకు సుంకమేదియు నెంచరే !
కొల్ల పోవని పాలకుండది- కుడిచి కుడుపుటే నేర్వమంచు ,
వాదులెందుకు అందుకొనుడిదే అమరపానమునందురే,!!

కుడియ నెంచితి కుడియ గలనని – కుడియ నెంచితి తగిన కుడుపని!
కుడియ నెంచితి కలిమి కలుగగ – కుడియనెంచితి బలిమి కలుగగ !!
కుడియ నెంచితి మాయ తొలుగగ – కుడియ నెంచితి మహిమ కలుగగ !!
కుడియ నెంచితి కర్మ తరుగగ – కుడియ నెంచితి మర్మమెరుగగ !!
కుడియ నెంచితి బ్రతుకు మెరయగ – కుడియనెంచితి భ్రమలు మడియగ !!
కుడియనెంచితి ఎన్ని ఎందరో కుడిచినీ – కడు మురిపాల పాలను !!

చెల్లి పోయెను జీవనాడులు – వీగిపోయెను బ్రతుకు దారులు ,
దూరమెంతో ఉందనెంచిన తీరమదిగో తోచుచున్నది !
తొలగకున్నవి భ్రమల భీతులు – మరలకున్నవి ఊహ ఉరకలు ,
కరిగిపోయిన కాలమందున కరుగకున్నవి నాదు కర్మలు !
పొల్లు పోవని పాల కుడుపులు – కుడుపవైతివి కుదురు తీరును ,
నేరమెవరిది ? దోసమేవరిది ? దోగిలించెద తెలుపరే !!

పాలు నీవని కుడియ నెంచిన – పంచ ధారల బొమ్మ నేనయ!
పంతమాడక నీదు బలమును అందజేయుము నెమ్మన !!

మనసు మధనం

ఏ యోనులంజేరి ఏమి నేర్చితో తెలియ ,
లోనున్న నిను తెలియు విద్య నేనెరుగా!!
లోపమెన్నక నేడే నిను నీవే ఎరిగించు ,
వల్లభా వనమాలీ వరమౌని వేల్పా !!

నంద గోకులమందు గొల్ల బాలుడనెంచి
జతగట్టి నాతోన పసి ఆటలాడు !!
ఆటనలసిననాడు ఆయాసమునుబాప,
నీ ఒడిన పవళించు అవకాశమిమ్ము !! ||ఏ యోనులంజేరి||

శాపమేదో పొంది శిలయైన సతినంచు ,
చేరి నీ పాదంబు మోపు దయనెంచి !
కటిక కఠినంబైన శమ దమంబులుమాసి,
చేరి నీ చరితంపు చెర్వమై నిలువ !! (చెర్వము : ఒక పాత్ర)
||ఏ యోనులంజేరి ఏమి నేర్చితో తెలియ ||

గొల్ల పల్లెల బ్రతుకు గోపకాంతననెంచి ,
చాటుచేసిన చల్లముంతగొనరాదా !
ఏనాడు ఏతీరు ఎటువోత్తువోయంచు ,
నీ ఉనికినేనేను దినదినము తలుపా!!
||ఏ యోనులంజేరి ఏమి నేర్చితో తెలియ ||

వన వృక్షముల మసలు వనచరంబులదండు ,
దశకంఠు దునుమాడ చేరెనట నీ అండ !!
అందొకనిగా నన్ను ఎన్నరదా తండ్రి ,
అంది నీ ఆనతులు అనుదినము ముఱియ!!
||ఏ యోనులంజేరి ఏమి నేర్చితో తెలియ ||

వైరాన నినుజేరి నీ తనువుతాకినా ,
దితి సంతు సంజాతనని ఎంచరాదా !
లోని దురితములెల్ల దునుమాడి దీవించు ,
గోప వల్లభ నీదు దయ నాకు తగదా!!
||ఏ యోనులంజేరి ఏమి నేర్చితో తెలియ ||

వైరమెంచని నీవు దశరథాజ్ఞను బడసి
వన వనంబుల దారి తరలు తరుణమున ,
ముని వాసముల మసలు దాసిగెన్నగరాద
పద సేవ భాగ్యంపు భావనను మురియా!!
||ఏ యోనులంజేరి ఏమి నేర్చితో తెలియ ||

దశకంఠు దునుమాడి ధరణినేలినవాడా ,
నాలోని దురితములు దునుమాడరాదా !
రామ రామా రామ రాజీవనయన యని ,
తలచు తలపుల నేను మునకేసి ముఱియ!!

ఏ యోనులంజేరి ఏమి నేర్చితో తెలియ ,
లోనున్న నిను తెలియు విద్య నేనెరుగా!!
లోపమెన్నక నేడే నిను నీవే ఎరిగించు ,
వల్లభా వనమాలీ వరమౌని వేల్పా !!




లాలీ!! లాలీ!!

లాలి లాలీ యనుచు – లాలీ పాటలుపాడి
లాలూచెనట నిన్ను – నందునిల్లాలూ !!
గోకులపు ప్రతి ఇంట ఉయాలుంచి రటపుడు
గోపకాంతలు నిన్ను గారవించంగా !!
లాలీ – లాలీ!!

కొసలేశుని ఇంట జోలలూగిన నాడు,
రాచనగరంబంత లాలి పాడేను,
ముగ్గురమ్మల ముద్దుమురిపాలు గొని నీవు
తమ్ములందర గూడి పురమునేలేవు !!
లాలీ!! – లాలీ!!

పొద్దు పొడవకముందే పొన్నకొమ్మలజేరి,
పురమోహ హరణకై వెదురునూదంగా ,
వల్లెయని లాలించి వందంబులు తెలిపి ,
పొన్నకొమ్మలు నీకు లాలినూచేను !!
లాలీ || లాలీ ||

గాధి పుత్రుడునిన్ను పవళింపజేయగా ,
పల్లవంబుల పడక నమరించినపుడు ,
వనకన్నె పులకించి విరి రెమ్మలూయంగ,
సారసంబులు నీకు జోల పాడెను !!
లాలీ ! లాలీ!!
(విశ్వామిత్రుడి :గాధి పుత్రుడు ) శ్రీ రామ లక్ష్మణులను యజ్ఞ సంరక్షణకు తీసుకు వెళ్లే సమయం సారసంబులు: పక్షులు)

ఖగరాజ వైరి గని – మదమణచగా నీవు ,
అందె సందడిజేయ నర్తించినపుడు ,
కొలను అల సంచారంబు జతగూడి నీకూ ,
ఉయ్యాల జంపాల ఊయలూగేను !!
లాలీ !! లాలీ !!
( కాళింది నర్తనము )

సురవైరి సంచార దురితంబు దునుమాడ ,
ధనువు నందిన నిన్ను ఉత్సహించంగా,
గగన దుందుభులపుడు కదన తాళము నడిపి,
నీ పాద విన్యాస లయలు కూర్చెను !!
లాలీ !! లాలీ !
( విస్వామిత్రుని యాగ సంరక్షణ చేస్తున్న శ్రీ రాముడు )

రుక్మిణీ సతిగూడి పురము జేరిన నీకు ,
పలు పళ్లెముల మణి హారతుల నిడుచూ ,
కుసుమ సంజాతమవు మంచి ముత్యపు తొట్ల
తరుణులందరుగూడి ఉచేరు నిన్ను !!
లాలీ !! లాలీ !!

శశిమౌళి చాపమును శమియించి యశమంది ,
ఇందువదనను కూడు – ఘన వైభవమును ,
జనక భాగ్యము నెరిగి మురిసి ముల్లోకములు ,
సురవల్లభుని పాన్పు నూచి మురిసేరు!!
లాలీ !! లాలీ!!

నాడు నందుని ఇంట ఊయలూగిన వాడు,
కౌసల్య కౌగిలిన జోలలూగినవాడు ,
లోకాల లోగిళ్ల లాలానందగ నేడు,
నాయింట ఉయ్యాల లూగుచున్నాడు!!
లాలీ!! లాలీ!!

ఒక వెన్నల రాత్రి

జోలలూగెడి ధరణి వాసుల మనసు మూలాల ఒదిగియున్నా
వింత ఊహల విలువ లేవో వెలుగులందగ – కలల కబురులు,
కొల్లగా కురిపించు రాయుడు – కలువ కన్నుల వెలుగు వేలుపు ,
నింగి తళుకుల తార కన్నెల సొగసు నేలగ తరలెనే!!

సంధ్య చెరగున నిదురలేచిన కటిక చీకటి తెల్లబోవగా ,
పైడి వెన్నెల చీర చెరగున వెండి మబ్బుల వేడుకాయెను !
కబురులేవో అందజేయగ తరలు తారల సందడాయెను,
నిదుర మాగిన కంటి రెప్పల మాటులో – అవి ఒదిగి పోయెను !

సుధా సాగర సార్వభౌమిని ఆదరంబును అందనెంచిన ,
సాధు సజ్జన సరస సంగులు – పుడమి మొలచిన పుణ్య పురుషులు
సుధా ధరల ధరణి జేరెడి,- నియతి నియమపు విపుల పంక్తుల
మధుర సూచన మరల జేయక ధారణందగ నిలచిరే!!

నాడు రాధిక మధుర కల్పన- కనులగట్టగ మురళి నూదిన,
నందనందను నందమంతయు – తారలాంతర మందు మెఱయుచు,
అంగనంగన అంతరంబున నిలిచి ఆడిన రాసలీలను ,
కనుల కద్దగ కనిన మౌనులు- మౌనమున మునకేసి మురిసిరి!!

పార్వతీపతి శిఖిన ఒదిగిన – వంకలేరుగని చంద్ర వంకను ,
వంగి లీలగ చేరరమ్మని లాలనెంచిన కోమలాంగికి
మోదమమరగ మురిపెమెన్నుచు – మంచుకొండలు మేలనెంచగా,
మదను గూల్చిన మోహనాంగుడు నటనమాడగ గాంచిరే!!

లాలి జోలలనూగు రాముని రమణులందరు లాలనెంచగా ,
తొంగిచూసిన కలువరాయుడు చిన్నబోయిన తరినిగంటిరి!
సోమరాయుని సోయగంబును అందబోయిన అవనినాధుని,
ఆటపాటల లీల వైనము మనసు నిండగ మోదమొందిరి !!

వాదులెన్నక వచ్చిచేరెడి వాగు వంకలు నదీ నదముల ,
సంగమందుచు సరసమాడెడి సాగరుడు తన ముదము తెలుపగా ,
అలల చేతులు ఎగసి అంబర అవధులను దునుమాడి సాగగా,
శరణు శరణని తారనాధుడు తరలు తీరును గాంచిరే!!

సప్త అశ్వములమరియున్నా ఏక చక్రపు రధము సవ్వడి ,
కలలు మానెడి సమయమాయెను – నిత్య కర్మల తరలమన్నది!
ధారణందిన దివ్య భావన – భావనందున నిలువరించుచు ,
ఉషా కన్నియ ఉనికి నెంచుచు విబుధులెంతో మురిసిరే!!

పలుకు పల్లకి 🦚

నాద రూపుడై ప్రతి జీవిలో ప్రకాశించే పరమాత్మను – గుర్తించినా గుర్తిచకపోయినా – ఆ అనంతుడి ప్రేమలో లోపమేముండదు – కానీ గుర్తెరిగితే ధన్యులమౌతాము

పాత్రతెన్నక భిక్షనొసగెడి – పరమ పావనుడుండగా !
పిన్నవాడను తాపమేలయ – తగిలియుండుము తీరుగా !!

వాణి నొసగిన వాడు వాడని – వారిజాక్షికి విభుడు వాడని,
మనసు నలజడు లణగ జేయగ – పొంగు పలుకుల పల్లకతడని ,
ఎరిగి ఎంచిన – ఎరుగకెంచిన – ఏవగించడు – హెచ్చునెంచడు ,
ముదముతో నీ మురిపెమానగ – తరల జేయును నీదు పలుకులు!!

వాణి వారసులన్న విబుధుల ప్రౌఢ కవితల పదములు,
పాలు కుడిచెడి పిన్న పాపడి పలుకు లెరుగని సద్దును,
కాటి పాపడి కఠిన పదములు – కన్నె పిల్లల తీపి కబురులు,
తరల జేయును తలచు తీరున – తాను మెచ్చడు – తొలగ నెంచడు!!

విలువ నెంచుచు విన్నపంబుల నందజేయగ వేడువారల ,
విన్నపంబులనందు కరిగిన కోమలత తా కొసరియందును !!
ఆలకించెడి వారి వీనుల లాలనెంచుచు అందజేయును ,
అమర వాణిన అమరియున్నా అనరు నందలి అందము !!

వాణి వరమని – వాని ఉనికని – ఎంచనేరని మోహజీవులు ,
మోసమెంచెడి మోటు మాటల మూట మోపగ వెరపు చెందరు!!
వాదులాడగ – పీడ పంచగ – చౌక బేరపు పల్లకిదియని,
పరమపావను నురముపై తమ అధమ యోచన మోపునుంతురు!!

ఎన్నరే ఆ పరమపావను దయను దామ్యము, ధీర సంపద,
సంతు సంగము విడువనొల్లని సాధు సాగరు స్నేహ చెల్వము
ప్రేమమీరగ పంచి ఇచ్చిన నెయ్యమను పెన్నిధులు ప్రోవును,
ఎరిగి ఎన్నిక గొన్న పదముల విరుల చెండుల మోపరే !!

పాత్రతెన్నక భిక్షనొసగెడి – పరమ పావను నెరుగరే !!
పిన్నతనమును తొలగజేసుక – తగిలియుండరె తీరుగా !!

Observer Effect

The observer effect is the physical or psychological change that happens to a system or a person simply by the act of observing or measuring it. Padmini felt that this poem is so. So the title ..

మాయ మోహము మధుర భావము ,
మనసు కోరెడి చిరుత లోకము !
లోపమెన్నదు – లోటులెరుగదు ,
మీరి మన్నన కొసరి కరుగును!!

కన్న ప్రేమను మాయ యందురు,
మాయ మోహము భారమందురు!
భారమెంచని తల్లులే ఈ –
జగతి నడతకు మూలమందురు !!
కనుల గట్టగ జగతి నిలిపిన ,
పరుని ఉనికిని తెలుయు మందురు !
ఉనికి తెలుపక మురుగు జొచ్చిన ,
పరుని కల్పనే – జగమనందురు!!

మాయ మోహము మధుర భావము ,
మనసు కోరెడి చిరుత లోకము !

విబుధు లెందరొ వివరమెంచగ,
వేల యుగములు యోచనెంచిరి !
వివిధ యోచన మధనములలో,
మాయ మధురిమ విలువ నెరిగిరి !!
మాయ విడివడ కనులు తెరచిన,
శేషశయను నశేష యోచన,
విడువ నొల్లదె మాయ చెరగును ,
చెదరి పోవగ జగతి కల్పన||

మాయ మోహము మధుర భావము ,
మనసు కోరెడి చిరుత లోకము !

ఎవని మన్నన నంద పలువిధ
మహిమలను తన ఉనికి జేసుక
జగతి అణువుల అంతరంగపు
ఆశయైతా నవతరించెనో !!
వాని ఉనికిన ఊరడిల్లాగా
వెసులుబాటును వెల్లడించగా –
మాయ మించిన గురువు దైవము
ఎన్ననగునె ఎన్నడైనను !!

మాయ మోహము మధుర భావము ,
మనసు కోరెడి చిరుత లోకము !

మాయ లేకీ జగతి లేదని,
జగతి కలుగగ మాయ కలదని,
మాయ కవ్వలి వానినెరుగగా ,
మాయ నెరుగుటె తగిన తీరని!!
తెలియవలయును మాయ మమతను,
విబుధులెరిగిన మొహమెరుగగ |
ఎరిగి మోహము నెరుగవే –
ఆ మొహమెరుగని మోహనాంగుని!!

మాయ మోహము మధుర భావము ,
మనసు కోరెడి చిరుత లోకము !!

18th August

18th August -2026 . మా అమ్మ నన్ను కన్న తెనాలి నుంచి వేల మైళ్ళ దూరంలో ఉన్నాను. అమ్మ ఇప్పుడు లేదు, కానీ ఆ అమ్మ ఇచ్చిన , పెంచిన శరీరంలో ”నేను” ఉన్నాను. ఈ రోజు మా అమ్మ పుట్టిన రోజు .. ఆ తలపు

క్షయము గానక్షరము పట్టి నేర్పిన తల్లి,
అరకు గానొక అరకు కుడిపి పెంచిన తల్లి,
తనువు తారణ తరిని తరచి తెలియుమనంచు,
జగతి దారుల వెంట తరల జేసిన తల్లి!!
తనువు నిచ్చిన తల్లి! నా కన్న తల్లి!!

జగదంబ ఒడినుండి జారీ వచ్చితినంచు ,
పలుమారు ఆ తల్లి తలపు తలపున నిలిపే!
జగతి దారుల వెంట జంట యామేయంచు,
దారి లేనీ పుడమి పయనమందు మనంది!!
తనువు నిచ్చిన తల్లి! నను గన్న నాతల్లి ||

మోము నీరజమంచు చేరవొత్తురు ఒకరు
తుది వాసమని ఎంచి తొలగువా రింకొకరు !!
చేరినా- తొలగినా – తొలగువారనెఱిగి
తగిలుండు ఆ పతిని తలచి తరలుమనంది!!
తనువు నిచ్చిన తల్లి! నను గన్న నాతల్లి ||

నాటి మాటల కుడుపు – నేటికిని మనుగుడుపు,
మమత ఊటలమూట మాటెరుగనా మాట!
తనదారి తానెపుడో తరలి పోయినగాని,
తానిచ్చినీ తనువు తలచు తన్నెపుడూ !!

వర్ధిల్లవమ్మ నా మనసునందెపుడూ,
వందనంబిదె నీకు – దీవించు నన్ను !!

ప్రేమ!

బదులు రాదని తెలిసి – కబురు పంపుటె ప్రేమ,
కొరత వెలుతుల కొలత – కొలువ నెరుగదు ప్రేమ!
మాయలోకపు మడుగు – ఏ సుడుల ముంచెనని ,
మాయ మెచ్చెడివాని – గురుతు నెంచుటే ప్రేమ !!

ఫలము తెలియని కర్మ – కోరి చేయుటె ప్రేమ,
కర్మ కూర్చెడి ఫలము – కొలత నెన్నదు ప్రేమ!
కర్మ ఫలములు కూలి – కొల్లపోయిననాడు ,
కాల కాలుని ఉనికి – తలపు నెన్నుటే – ప్రేమ!!

తొలగిపోవు ననెరిగి – తగిలియుండుటే ప్రేమ,
తగిలున్న బంధముల – బలము నెన్నదు ప్రేమ!
తొలగి బంధములన్ని – తరలిపోయెడి నాడు,
భవబంధ మోచనుని – జాడ నెరుగుటే – ప్రేమ!!

ఫలమందనని ఎరిగి – తరువు నాటుటె ప్రేమ,
తరువు ఫలముల నందు – పరులనెంచదు ప్రేమ!
శ్రమ సంకటములేక – ఫలమందువానిగని ,
పరమ ఫలమగువాని – ప్రేమ తెలియుట – ప్రేమ!!

తలుపవే ఓ మానస – ఆ ప్రేమ మధురిమలు ,
అవని ఆవలి అంచు – దాటి చనువరకు !!

గురు పౌర్ణమి 2026

అజ్ఞాన తిమిరాన ఆదమరచి నిదుర ,
ఆనందమని తలచి మరుల మునిగేవు!
అవధి గడిచిననాడు అలవిగానొక కుదుపు,
కరిగించి నీ సుఖము – కడు వేదనొసగు!!

కాలకాలుని కనులు కామించు ఆ మాయ,
కనగలుగు ప్రతి కనులు – కననెంచు మాయ ,
కరిగిపోవుననెరిగి – ఎరుక మరుగున చేర్చి ,
కొసరి కొంచెమునైన – పొందగోరెడి ఛాయ!!

||అజ్ఞాన తిమిరాన ఆదమరచి నిదుర||

పలుమారు మురిపాన మన్నించి మన్నించి ,
మనసు మునకలువేసి మెరిసేటి మాయ!
మన్నించదే నిన్ను కరిగి తొలిగేనాడు,
మమత మన్నన లేని మరుభూమి మాయ!!

||అజ్ఞాన తిమిరాన ఆదమరచి నిదుర||

మాయ పలుఛాయలను తొలగించు వానొకని,
పలుమారు నీ తలపు తగులనెంచెడివాని,
వెలితి సుఖముల తురిమి తరలించగలవాని,
తగుల తొందరనొంది – నిదుర విడరాదా!!

||అజ్ఞాన తిమిరాన ఆదమరచి నిదుర||

అవనికావలి యంచు కొలువు కలిగినవాని ,
అంతరంగము లందు విడిది చేసెడివాని,
చెలికానిగా నీకు చెలిమి జేర్చెడివాని,
ఎరిగి కూరిమి మీర కొలువు జేరగరాదా!!

||అజ్ఞాన తిమిరాన ఆదమరచి నిదుర||

ఆది ఆంతములేని ఆనంద నిలయునిని,
అంద చేరెడి దారి ఎరిగించగలవాని ,
దారి నడిచెడినాడు – తోడుండి ప్రతి అడుగు,
తొణుకు తొందర మాపి నడిపించు వాని!!

||అజ్ఞాన తిమిరాన ఆదమరచి నిదుర||

కనుతెరిచి కనుమంచు వేచియుండెడివాని ,
కనుపాప కదలికల కాపు కాసెడివాని,
గురియైన దారులన దొరలజేసెడివాని,
దొరతనంబుల దారి మరలజేసిడివాని!!

||అజ్ఞాన తిమిరాన ఆదమరచి నిదుర||

దేహ సందేహములు దమియించగలవాని,
జనన మరణపుదారి – దరిజేర్చగలవాని,
మోహ వైరములన్న భావమెరుగక నీదు,
భవ మోహ బంధముల తొలగించు వాని!!

||అజ్ఞాన తిమిరాన ఆదమరచి నిదుర||

ఎరుగవే ఓ మానస – మసక పొరలను విడిచి,
గుణము లెరుగని గురుని దివ్య సన్నిధిని !!
జగతి తారణ తరిని తెలియజేసెడి వాని,
తనియారగా తలచి తరియించు నేడే !!

అజ్ఞాన తిమిరాన ఆదమరచి నిదుర ,
ఆనందమని తలచి మరుల మునిగేవు!
అవధి గడిచిననాడు అలవిగానొక కుదుపు,
కరిగించి నీ సుఖము – కడు వేదనొసగు!!

కారణం – అకారణం

పుడకలందున కాలు దేహమెవరిదననంచు –
అడుగబోవడు వహ్ని ఎన్నటికి నిన్ను!
తన ధర్మమైనట్టి వాహకత్వము నెరపి –
వలయు పయనపు దారి దొరలింపజేయు!!

ఘ్రాణ రంధ్రముజేరి చెరియించు పవనుండు-
అడుగబోవడు నిన్ను ఎవనిదీ నాసికని |
అందవచ్చెడి హంస అంది చెరియింపఁగ –
అందజేయును లోని అరుదైన ఉనికి !!

పోషణందగజేసి పోషించు ధరణెపుడు –
అడుగనెన్నదు ఎవని కుక్షికీ కుడుపులని!,
సూర్య చెంద్రులు కురియు కరుణ కిరణపు బలిమి –
కుడుపుగా నందించు కుడియువాలకు!!

అవని జేరెడి చినుకు అడుగదే నిన్నెపుడు –
జేరి ఏ తరి నేను ఏమి చేతుననంచు !
దాహార్తి దహియించు తన దివ్య తేజమును –
అందువరాలకెల్ల తానంద జేయు !!

జగతి కలుగగతాను – జగతి నిలుపగతాను –
జగతి జీవుల గతుల గతియైన తాను,
అడుగ జాలదు ఎవని ఏల జొచ్చితివనుచు –
అంతరంబుల అవధి అమరజేయంగ !!

నింగి నెలలు – వహ్ని వాయువు –
తోయమెరుగగ తలుప -తలపేలనీకు ?
వహియించు దేహంబు వహియించెనేలన్న
వగపు వీడికనీవు శమము భావించు !!